బస్సు డ్రైవర్, నలుగురు వైద్య విద్యార్థుల మృతి
20 మందికి గాయాలు
విజయవాడ, న్యూస్‌టుడే: విజయవాడలో ప్రైవేటు బస్సు చెట్టుకు ఢీకొట్టి, బోల్తా పడిన ప్రమాదంలో హైదరాబాద్ ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, బస్సు డ్రైవరు దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది మెడికోలకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై గొల్లపూడి పరిధిలోని నల్లకుంట సెంటర్ వద్ద సోమవారం రాత్రి 11 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొని బోల్తా పడింది. డ్రైవర్ మద్యం మత్తులో అతి వేగంగా బస్సు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మద్యం మత్తులో బస్సు నడపొద్దని అభ్యంతరం చెప్పిన తమతో గొడవపడి డ్రైవర్, వేగంగా వెళుతూ బస్సును హఠాత్తుగా ఒక పక్కకు తిప్పి ప్రమాదానికి కారణం అయ్యాడని విద్యార్థులు తెలిపారు. ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థుల బృందం వారం రోజుల క్రితం అమలాపురంలో జరిగిన వైద్య విద్యార్థుల క్రీడా పోటీలకు వచ్చింది. పోటీలు ఆదివారం ముగియడంతో సోమవారం ధనుంజయ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో విహారయాత్రకు బయల్దేరారు. విజయవాడలోని భవానీద్వీపం, అమరావతి తదితర ప్రాంతాలు తిరిగి, రాత్రి హైదరాబాద్ బయలుదేరారు. విజయవాడ నుంచి బయలుదేరిన కాసేపటికే బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది వైద్య విద్యార్థులు ఉన్నారు. ప్రమాదంలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న మచ్చా ప్రణయ్ రాజారాం, హౌస్ సర్జన్లుగా పని చేస్తున్న గిరి లక్ష్మణ్, మూకా విజయ్‌తేజ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో వైద్య విద్యార్థి విజయ్‌కృష్ణ మోహన్/ఉదయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
గాయపడిన కొందరు విద్యార్థులను పోలీసులు సంఘటనా స్థలంలోనే విచారించారు. అనీల్ అనే మెడికో తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థులకు, బస్సు డ్రైవర్‌కు ప్రమాదం జరగడానికి కొద్ది సమయం ముందు నుంచే గొడవ జరిగినట్లు తెలిసింది. విద్యార్థులంతా హైదరాబాద్ వెళ్లే క్రమంలో సోమవారం ఉదయం మంగళగిరి సమీపంలోని హాయ్‌లాండ్ వెళ్లారు. అక్కడే బస్సులో బట్టలు, పర్సులు పెట్టి బస్సు క్లీనర్‌ను కాపలా ఉంచి లోపలకు వెళ్లారు. బయటకు వచ్చి చూస్తే 10మంది పర్సులు చోరీకి గురయ్యాయి. క్లీనర్ కూడా అక్కడ కనిపించలేదు. దీంతో వారు డ్రైవర్‌తో గొడవకు దిగారు. అనంతరం బస్సును డ్రైవర్ హైదరాబాద్‌కు బయల్దేరదీశాడు. తర్వాత కూడా విద్యార్థులకు, డ్రైవర్‌కు గొడవ జరిగింది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ అతి వేగంగా బస్సును నడపడమే కాకుండా బస్సు స్టీరింగ్‌ను బలంగా తిప్పడంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టు ఢీ కొని, బోల్తా పడింది. బస్సు విజయవాడ నుంచి బయల్దేరడానికి ముందే డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, మరో డ్రైవర్‌ను పంపించాలని యజమానికి ఫోన్లో చెప్పామని తెలిపారు.
0 comments:
Post a Comment